మార్చి 1 నుంచి పాఠశాలలకు సెలవులంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • కరోనా సాకుతో సెలవులు అంటూ ప్రచారం
  • కొట్టిపారేసిన ఆదిమూలపు
  • అలాంటి వార్తలను వైరల్ చేయొద్దని స్పష్టీకరణ
  • దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  • పాఠశాలలు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని వెల్లడి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో మార్చి 1 నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని, అయితే ఈ వార్తల్లో నిజంలేదని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలను ఎవరూ వైరల్ చేయొద్దని కోరారు. ఒకవేళ ఈ విధమైన ప్రచారానికి ఎవరైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

దుష్ప్రచారం చేస్తున్నవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించామని చెప్పారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఎప్పట్లాగానే నడుస్తాయని స్పష్టం చేశారు. ఎవరూ అపోహలకు గురికావొద్దని తెలిపారు.


More Telugu News