ఇంగ్లండ్ ఆటగాళ్లే కాదు మనం కూడా తప్పులు చేశాం: రోహిత్ శర్మ

  • తొలి ఇన్నింగ్స్ లో మన బ్యాట్స్ మెన్ కూడా విఫలమయ్యారు
  • పిచ్ లో ఎలాంటి లోపం లేదు
  • పరిస్థితులను బట్టి షాట్ లు ఆడేందుకు వెనుకాడకూడదు
అహ్మదాబాద్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాకుండా మన బ్యాట్స్ మెన్ కూడా తప్పులు చేశారని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కూడా బ్యాటింగ్ లో విఫలమైందని, పిచ్ లో ఎలాంటి లోపం లేదని... పిచ్ లో దయ్యాలు లేవని చెప్పాడు. ఆ పిచ్ పై ఒకసారి నిలదొక్కుకుంటే పెద్ద స్కోరు సాధించవచ్చని తెలిపాడు.

ప్రతి బంతిని డిఫెన్స్ ఆడటం సరికాదని రోహిత్ చెప్పాడు. స్పిన్ కు అనుకూలించే  పిచ్ పై ఎంతో జాగ్రత్తగా ఆడాలని అన్నాడు. బంతి అనూహ్యంగా స్పిన్ అవుతూ వికెట్ల మీదకు దూసుకొస్తుంటుందని... పరిస్థితులను బట్టి షాట్ లు ఆడేందుకు వెనుకాడకూడదని చెప్పాడు.

తన వరకైతే వికెట్ కాపాడుకోవడం మాత్రమే ముఖ్యం కాదని... పరుగులు సాధించడం కూడా ముఖ్యమేనని అన్నాడు. మంచి బంతులను గౌరవిస్తూ, చెడ్డ బంతులను వేటాడతానని చెప్పాడు. మరోవైపు మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 66 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేశాడు.


More Telugu News