కష్టాల్లో టీమిండియా... వెంటవెంటనే 4 వికెట్లు తీసిన ఇంగ్లండ్

  • ఓవర్ నైట్ స్కోరు 99/3తో ఆట కొనసాగించిన భారత్
  • విజృంభించిన లీచ్, రూట్
  • చెరో రెండు వికెట్లు సాధించిన వైనం
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 125/7
మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 99/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెంటవెంటనే 3 కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. 7 పరుగులు చేసిన రహానే లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ (66) కూడా అవుట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రోహిత్ కూడా లీచ్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఇక, భారీ హిట్టర్ రిషబ్ పంత్ ను ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన తొలిబంతికే పెవిలియన్ చేర్చాడు. ఆపై మరోసారి విజృంభించిన రూట్... ప్రమాదకర వాషింగ్టన్ సుందర్ ను బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ 125 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (10 బ్యాటింగ్), అక్షర్ పటేల్ ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్ కావడం తెలిసిందే.


More Telugu News