రేపటి భారత్ బంద్ కు మద్దతు ప్రకటించిన లారీ యజమానుల సంఘం

  • దేశంలో మండిపోతున్న ఇంధన ధరలు
  • కొన్ని రాష్ట్రాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర
  • అదే రీతిలో డీజిల్ ధరలు పైపైకి!
  • బంద్ కు పిలుపునిచ్చిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్
చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. జీఎస్టీ నిబంధనలు సమీక్షించాలని, పెరిగిన చమురు ధరలు తగ్గించాలని కోరుతూ బంద్ నిర్ణయం తీసుకుంది. ఈ బంద్ కు లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, ఏటా టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని స్పష్టం చేశారు.

గత కొన్నిరోజులుగా పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.100 దాటింది. అదే బాటలో డీజిల్ రేట్లు కూడా పెరుగుతుండడంతో భారీ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ప్రకటించిన రేపటి బంద్ కు 40 వేల వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తగా డీజిల్ ధరలు ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ విధానం సమీక్షించాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. కొత్త ఈ-వే బిల్లుల విధానాన్ని రద్దు చేయాలని, మరికొన్ని నిబంధనలు కూడా రద్దు చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది.


More Telugu News