ట్రంప్ పరిస్థితి ఏంటో తెలుసు కదా.. ఎన్నికల తర్వాత మోదీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారుతుంది: మమత

  • మోదీ ప్రసంగించిన చోటే మమత బహిరంగ సభ
  • మోదీని ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా పేర్కొన్న సీఎం
  • షా, మోదీలపై విరుచుకుపడిన మమత
అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్‌కు ఎదురైన పరాభవమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి ఎదురవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గతవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించిన హుగ్లీ జిల్లా సహగంజ్‌లో నిన్న మమత బహిరంగ సభ నిర్వహించారు.

 ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా మోదీని అభివర్ణించారు. అమిత్ షా, మోదీ ఇద్దరూ కలిసి అసత్యాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోదీ అవకాశవాది అని, అల్లర్ల సృష్టికర్త అని ఆరోపించిన మమత.. కోట్ల రూపాయలకు దేశాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

టీఎంసీ కమీషన్లు (కట్ మనీ) తీసుకుంటుందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు మరి దీనినేమంటారని ప్రశ్నించారు. క్యాట్ మనీ అంటారా? లేక, ర్యాట్ మనీ అంటారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ట్రంప్ కంటే దారుణంగా మోదీ పరిస్థితి తయారవుతుందన్న మమత.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్యను బొగ్గు దొంగ అని ఆరోపించడం మొత్తం మహిళలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News