దెయ్యం ఉందంటూ కాల‌నీ మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన ప్ర‌జ‌లు!

  • జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఘ‌ట‌న‌
  • కాల‌నీని వీడిన‌ 40 కుటుంబాలు
  • ఓ పాడుబడిన భవనంలో దెయ్యం తిరుగుతోందని వ‌దంతులు
ఆధునిక కాలంలోనూ కొందరు మూఢ న‌మ్మ‌కాల‌తో ఇబ్బందుల‌ను కొనితెచ్చుకుంటున్నారు. అలాగే, దెయ్యం తిరుగుతుందన్న వదంతుల‌ను న‌మ్ముతోన్న ప్ర‌జ‌లు కాల‌నీ మొత్తాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన ఘ‌ట‌న జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో చోటు చేసుకుంది.

దాదాపు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టడం గ‌మ‌నార్హం. బేడ బుడగ జంగాల   కాల‌నీలోకి వెళ్లి ఇప్పుడు చూస్తే ఒక్క‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. ఓ పాడుబడిన భవనంలో రాత్రి స‌మ‌యంలో దెయ్యం తిరుగుతోందని గ్రామ‌స్థులు భావిస్తున్నారు.

అందులో ఆడ‌ దెయ్యం నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. ఆ కాలనీలో భాను, బాలరాజు అనే సోద‌రులు గత ఏడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మృతి చెందారు. ఇటీవ‌ల‌ రోడ్డు ప్రమాదంలో మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ‌ర‌ణాల‌కు చేతబడి, దెయ్యమే కారణమని కాలనీ వాసులు న‌మ్ముతున్నారు.

యువకులు మాత్రమే చనిపోతున్నారని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. అంతేగాక‌, అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని, కాబ‌ట్టి దెయ్యం వ‌ల్లే అనారోగ్యం వస్తోందని అక్కడి ప్రజలు అమాయ‌కంగా మాట్లాడుతున్నారు. దెయ్యాలు ఉండ‌వ‌ని పోలీసులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నప్ప‌టికీ ఆ కాల‌నీ వాసులు త‌మ తీరును మార్చుకోవ‌ట్లేదు.


More Telugu News