గులాబీ బాల్ తో సవాలే.. తొలి గంటన్నర ఛాలెంజింగ్ గా ఉంటుంది: కోహ్లీ

  • లైట్ల వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి
  • ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం మనకు ఉంది
  • చివరి రెండు టెస్టులు గెలిచేందుకే ప్రయత్నిస్తాం
మొతేరా వేదికగా రేపటి నుంచి ఇంగ్లండ్ తో మూడో టెస్టు జరగనుంది. ఈ టెస్టు డేనైట్ (పింక్ బాల్) మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పిచ్ పేస్ కు అనుకూలిస్తే ఇంగ్లండ్ కు అనుకూలిస్తుందనే వాదన వినిపిస్తోంది. దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, స్వింగ్ కు అనుకూలించే పిచ్ లపైనే ఇంగ్లండ్ ను ఓడించామని చెప్పారు.

పేస్ కు అనుకూలించే వాళ్ల సొంత మైదానాల్లోనే వారిని చిత్తు చేశామని తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం ఇండియాకు ఉందని తెలిపాడు. పింక్ బాల్ తో ఆడటం సవాల్ తో కూడుకున్నదని అన్నాడు. లైట్ల వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అన్నాడు.

మరో విజయాన్ని అందుకుంటే స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. ఈ రికార్డుపై కోహ్లీ మాట్లాడుతూ, అలాంటి విషయాలను తాము పట్టించుకోమని చెప్పాడు. రికార్డులు అస్థిరమైనవని అన్నాడు. మాజీ కెప్టెన్ పై తమకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంటాయని చెప్పాడు. చివరి రెండు టెస్టులు గెలవాలనే తాము ఆడతామని అన్నాడు.


More Telugu News