ఐఏఎస్, ఐపీఎస్ లు నిస్సహాయులైపోయారు.. వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి: జేసీ

  • పంచాయతీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్రను పోషించింది
  • ఒక్కో ఓటుకు రూ. 5 వేలు కూడా పంచారు
  • డబ్బు పంచకుండా పీఎం గెలిస్తే నా ఆస్తి మొత్తాన్ని వదిలేస్తా
పంచాయతీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్రను పోషించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఆధిపత్యం సాధించడం కోసం ఒక్కో ఓటుకు రూ. 5 వేలు కూడా పంచారని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు పంచడం సాధారణమైపోయిందని అన్నారు. డబ్బు పంచకుండా ప్రధానమంత్రి సైతం గెలిస్తే తన ఆస్తి మొత్తాన్ని వదిలేస్తానని చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి పోలీసులు పూర్తిగా సహకరించారని జేసీ విమర్శించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ మద్దతు పలికిన అభ్యర్థులను పోలీసులు బహిరంగంగానే బెదిరించారని చెప్పారు. ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేస్తారేమోననే భయం అధికారుల్లో ఉందని అన్నారు. తప్పు చేస్తున్నామని తెలిసినా, తప్పని పరిస్థితిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మనసులను బాధ పెట్టుకుంటూ పని చేస్తున్నారని అన్నారు. వారు నిస్సహాయులైపోయారని... వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.


More Telugu News