మనిషి ముఖాన్ని పోలిన సొరచేప... అదృష్టాన్ని తెస్తుందంటున్న మత్స్యకారుడు!

  • ఇండోనేషియాలో విచిత్ర సొరచేప
  • మనిషిలా కళ్లు, నోరు కలిగివున్న సొర
  • సందడిగా మారిన మత్స్యకారుడి ఇల్లు
  • చేపను అమ్మాలని కోరుతున్న స్థానికులు
  • ససేమిరా అంటున్న మత్స్యకారుడు
ఇండోనేషియాలో ఓ సొరచేప అందరినీ ఆకర్షించింది. తూర్పు నూసా టెంగారా ప్రావిన్స్ తీర ప్రాంతంలో వేటాడుతుండగా అబ్దుల్లా నూరెన్ అనే మత్స్యకారుడి వలకు భారీ సొరచేప చిక్కింది. దాని పొట్టను కోసి చూడగా అందులో మూడు చిన్న సొరచేపలు దర్శనమిచ్చాయి. వాటిలో ఒక సొరచేప ముఖం చూడ్డానికి మనిషి ముఖంలా ఉండడంతో అబ్దుల్లా నూరెన్ విస్తుపోయాడు. ఎప్పుడూ ఇలాంటి చేపను చూసి ఉండకపోవడంతో దాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు చూపించాడు. పొరుగువారు ఆ సొరను కొనుగోలు చేస్తామని ముందుకొచ్చినా అబ్దుల్లా అందుకు తిరస్కరించాడు.

ఇక, ఈ విచిత్ర సొరచేపను చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుండడంతో అబ్దుల్లా ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. చాలామంది దీన్ని అమ్మాలని కోరుతున్నారని, కానీ ఇది అదృష్టం తీసుకువస్తుందని భావిస్తున్నానని, అందుకే ఎవరికీ విక్రయించబోనని ఆ మత్స్యకారుడు స్పష్టం చేస్తున్నాడు. కాగా, దీనిపై జీవశాస్త్ర నిపుణులు స్పందిస్తూ, జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటి జీవులు జన్మిస్తుంటాయని వివరించారు.


More Telugu News