పతంజలి 'కరోనిల్' ట్యాబ్లెట్లను అనుమతించం: మహారాష్ట్ర హోంమంత్రి

  • కరోనాకు ట్యాబ్లెట్లను తీసుకొచ్చిన పతంజలి 
  • క్లినికల్ ట్రయల్స్ ను ఐఎంఏ ప్రశ్నించిందన్న అనిల్ దేశ్ ముఖ్
  • సర్టిఫికెట్ వచ్చేంత వరకు అమ్మకాలను అనుమతించబోమని వ్యాఖ్య
పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ట్యాబ్లెట్లను మహారాష్ట్రలోకి అనుమతించబోమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు. కరోనాను తమ కరోనిల్ దీటుగా ఎదుర్కొంటుందని చెపుతూ పతంజలి ఈ మెడిసిన్ ను లాంచ్ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

కరోనిల్ క్లినికల్ ట్రయల్స్ జరిగాయని పతంజలి చెపుతోందని... అయితే ఆ ట్రయల్స్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నించిందని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. కరోనిల్ సమర్థతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సర్టిఫికెట్ ఇచ్చినట్టు పతంజలి చెప్పుకుంటోందని... అయితే ఆ వాదనను డబ్ల్యూహెచ్ఓ తోసిపుచ్చిందని చెప్పారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోరోనా వంటి మహమ్మారికి సంబంధించిన మందులు ఆదరాబాదరాగా ఆవిష్కరించడం సరికాదని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. పతంజలికి మద్దతుగా ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. కరోనిల్ కు డబ్ల్యూహెచ్ఓ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేదా ఇతర సంబంధిత సంస్థల నుంచి సర్టిఫికేషన్ వచ్చేంత వరకు వాటి అమ్మకాలను రాష్ట్రంలోకి అనుమతించబోమని చెప్పారు.

మరోవైపు 19వ తేదీన పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ... తమ కరోనిల్ కు డీసీజీఐ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ఏ డ్రగ్ నైనా అప్రూవ్ చేయడం కానీ, అప్రూవ్ చేయకపోవడం కానీ చేయదని తెలిపారు.


More Telugu News