ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని

  • ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం
  • ఈబీసీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడి
  • ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల మేర ఆర్థికసాయం
  • టిడ్కో ఇళ్లు 300 చదరవు అడుగుల లోపు ఉంటే రూపాయికే ఇల్లు
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈబీసీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్థికసాయం అందజేస్తామని వెల్లడించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. పట్టణాల్లో టిడ్కో ఇళ్ల విషయంపైనా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు నాని చెప్పారు. 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయకే లబ్దిదారులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

ఏప్రిల్ లో సుమారు 15 లక్షల పైచిలుకు విద్యార్థులకు వసతి దీవెన... ఏప్రిల్, జూలై, డిసెంబరు, ఫిబ్రవరి మాసాల్లో జగనన్న విద్యాదీవెన కింద 18.80 లక్షల పైచిలుకు విద్యార్థులకు సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్, జూన్ లో జగనన్న విద్యాకానుక కింద 42.34 లక్షల మందికి లబ్ది చేకూర్చుతామని వివరించారు.

ఏప్రిల్ లో 66.11 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు, అదే నెలలో 90.37 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, మే నెలలో 9.40 లక్షల మందికి పంటల బీమా, మే, అక్టోబరు, జనవరి మాసాల్లో మూడు విడతలుగా 54 లక్షల మందికి రైతు భరోసా అందిస్తామని పేర్ని నాని వెల్లడించారు.


More Telugu News