14 ఏళ్ల బాలికతో పాక్ ఎంపీ సలాహుద్దీన్ అయూబీ వివాహం!

  • అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక
  • ప్రస్తుతం బెలూచిస్థాన్ నుంచి ఎంపీగా ఉన్న సలాహుద్దీన్
  • విచారిస్తున్న పోలీసులు
పాకిస్థాన్ ఎంపీ ఒకరు 14 సంవత్సరాల బాలికను వివాహం చేసుకోగా, తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెలూచిస్థాన్ జాతీయ అసెంబ్లీ మెంబర్, జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత మౌలానా సలాహుద్దీన్ అయూబీ, ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లాడిన అమ్మాయి వయసు 14 ఏళ్లు మాత్రమేనని, అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక, ఇప్పుడు జుగూర్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని స్థానిక మహిళా సంక్షేమ విభాగం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి పాకిస్థాన్ లో బాలికలకు 16 ఏళ్లు వచ్చే వరకూ వివాహం చేయరాదు. అంతకన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తే, తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడతాయి. సలాహుద్దీన్ వివాహంపై విచారణ ప్రారంభించిన పోలీసులు, బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు అసలు తమ అమ్మాయికి వివాహమే జరిపించలేదని అఫిడవిట్ ను ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక సలాహుద్దీన్ వివాహం చేసుకుంది బాలికనేననే వార్తలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.



More Telugu News