వినియోగదారులను ఆకర్షించే విషయంలో గొడవ.. రోడ్డున పడి కొట్టుకున్న పానీపూరీ వ్యాపారులు

  • ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో ఘటన
  • రణరంగాన్ని తలపించిన బజారు
  • కర్రలు, లాఠీలతో చితకబాదుకున్న వైనం
వినియోగదారులను ఆహ్వానించే విషయంలో చెలరేగిన వివాదం లాఠీలు, కర్రలతో రోడ్డునపడి కొట్టుకునే వరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బడౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ బజార్‌లో రెండు పానీపూరీ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వినియోగదారుడు అక్కడికి రావడంతో తన షాప్‌కు రావాలంటే, తన షాప్‌కు రావాలంటూ ఇద్దరూ అతడిని ఆహ్వానించారు. ఈ క్రమంలో రెండు దుకాణదారుల మధ్య గొడవ మొదలైంది.

క్షణాల్లోనే గొడవ ముదిరింది. లాఠీలు, కర్రలతో ఇరు వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కారు. ఇష్టం వచ్చినట్టు బాదుకున్నారు. వీరి గొడవతో మార్కెట్ రణరంగాన్ని తలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నేత ఒకరు ‘న్యాయ వ్యవస్థకు మంగళం పలికిన ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్’ అని కామెంట్ చేశారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



More Telugu News