నేడు బీజేపీలోకి సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్.. రేపో మాపో ఫిరోజ్‌ఖాన్ కూడా!

  • కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు
  • బండి సంజయ్‌తో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ చర్చలు
  • అనుచరులతో కలిసి కమలం తీర్థం పుచ్చుకోబోతున్న హరీశ్‌బాబు
తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరగా, ఇప్పుడు మరింతమంది నేతలు ఆయన దారిలోనే నడవనున్నట్టు తెలుస్తోంది. సిర్పూరు కాగజ్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు అనుచరులతో కలిసి నేడు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన నేడు కమలం తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. హరీశ్ తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సిర్పూరు కాగజ్‌నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 1999లో హరీశ్ తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అలాగే, హైదరాబాద్‌కే చెందిన మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయన ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒకటి రెండు రోజుల్లో ఆయన కూడా బీజేపీ గూటికి చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News