ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వ్యాఖ్యలు
  • గతంలో ఆగిపోయిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ జరగొచ్చని ప్రచారం
  • హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన జనసేన
  • తమ పిటిషన్ ను హైకోర్టు స్వీకరిస్తుందని నాదెండ్ల ఆశాభావం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ హైకోర్టు గడప తొక్కింది!

మున్సిపల్ ఎన్నికలకు సమయం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించలేకపోయామని, అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమయం ఉండడంతో కోర్టును ఆశ్రయించామని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ జనసేన పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు.

తమ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని కోరుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, తాజా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని  నాదెండ్ల స్పష్టం చేశారు. యువతకు ఎక్కువ అవకాశాలు రావాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉండాలని అభిప్రాయపడ్డారు.


More Telugu News