బెంగాల్ మార్పును కోరుకుంటోంది: మోదీ

  • హుగ్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ
  • ఈ నెలలో బెంగాల్ లో రెండోసారి పర్యటించిన ప్రధాని
  • టీఎంసీ నేతలు రోజురోజుకు సంపన్నులు అవుతున్నారని విమర్శ
బెంగాల్ మార్పును కోరుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెలలో బెంగాల్ లో ఆయన పర్యటించడం ఇది రెండోసారి. ఈరోజు ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు.

ఇన్నేళ్లు బెంగాల్ వెనుకబడిపోయిందని... ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. దోపిడీ జరుగుతున్నంత కాలం ఈ ప్రాంతం అభివృద్ది చెందలేదని చెప్పారు. మనకు అన్యాయం వద్దని, నిజమైన మార్పు అవసరమని అన్నారు. అమ్మ, భూమి, ప్రజల గురించి మాట్లాడుతున్నవారే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ ని ఉద్దేశించి విమర్శించారు.

బెంగాల్ ప్రజలకు తాగు నీటిని అందించడంలో కూడా టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని మోదీ అన్నారు. నీరు కావాలని అడుగుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... నీళ్లు అడుగుతున్నవారు బెంగాల్ బిడ్డలు కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. టీఎంసీ నేతలు రోజురోజుకు సంపన్నులుగా మారుతున్నారని, ప్రజలు మాత్రం పేదలుగా మిగిలిపోతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే బెంగాల్ ను అవినీతి రహిత, ఉద్యోగ, ఉపాధి ఉన్న రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు.


More Telugu News