మహారాష్ట్ర కేబినెట్లో కరోనా కలకలం... ఇప్పటివరకు ఈ నెలలో ఏడుగురు మంత్రులకు పాజిటివ్

  • ఒకే నెలలో కరోనా బారినపడిన మహా మంత్రులు
  • తాజాగా ఛగన్ భుజ్ బల్ కు పాజిటివ్
  • తనను కలిసినవాళ్లు టెస్టు చేయించుకోవాలని భుజ్ బల్ సూచన
  • తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడి
మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి జడలువిప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గంలోనూ పెద్ద సంఖ్యలో కరోనా బారినపడడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్ బల్ కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఈ ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర మంత్రివర్గంలో కరోనా పాజిటివ్ గా తేలిన మంత్రుల్లో ఛగన్ భుజ్ బుల్ ఏడోవారు. 2020లోనూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా 12 మంది మంత్రులు కరోనా ప్రభావానికి గురయ్యారు. కాగా, తనకు కరోనా సోకడంపై ఛగన్ భుజ్ బల్ స్పందించారు. గత మూడ్రోజుల వ్యవధిలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.


More Telugu News