విరాట్ కోహ్లీ గురించి బయట తెలిసింది చాలా తక్కువే: టీమిండియా మాజీ సెలక్టర్ శరణ్ దీప్ సింగ్

  • వాస్తవ జీవితంలో కోహ్లీ వేరు
  • అతనిలో ఎంతో ప్రశాంతత ఉంటుంది
  • పొగడ్తల వర్షం కురిపించిన శరణ్ 
మైదానంలో అందరికీ కనిపించే కోహ్లీ, వాస్తవ జీవితంలో కనిపించే కోహ్లీ వేరువేరని టీమిండియా మాజీ సెలక్టర్, క్రికెటర్ శరణ్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. కోహ్లీని క్రికెట్ ఆడేటప్పుడు చూసే వారంతా అతనికి చాలా కోపమని, ఎవరి మాటా వినే రకం కాదని భావిస్తుంటారని, కోహ్లీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యానించిన శరణ్, ఈ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే విమర్శలనూ ప్రస్తావించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోహ్లీ గురించి తెలిసిన వారు, దగ్గరగా చూసిన వారు, అతని ప్రశాంతత, ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని పొగడకుండా ఉండలేరని అన్నారు. బయటి ప్రపంచంలో కోహ్లీ ఎంతో వినయంగా ఉంటాడని వ్యాఖ్యానించిన ఆయన, ఇతరులు ఎవరైనా వారి ఇంటికి వెళితే, కోహ్లీ దంపతులు ఎంతగానో ఆదరిస్తారని, ఇంట్లో అతను ఎలా ఉంటాడో చూస్తే, అసలు నమ్మలేమని అన్నారు.

మ్యాచ్ లో మాత్రమే కోహ్లీలోని దూకుడు కనిపిస్తుందని, మ్యాచ్ అయిపోయిన తరువాత అతనిలోని వినయ విధేయతలు బయటకు కనిపిస్తాయని అన్నారు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వినడం కోహ్లీలోని ప్రత్యేకతని, సెలక్షన్ సమావేశాలు దాదాపు గంటన్నర పాటు సాగితే, ఓ మంచి శ్రోతగా అందరూ చెప్పేది విని, ఆపై నిర్ణయం తీసుకుంటాడని అన్నారు.

తన ఇంటికి వచ్చే అతిథులకు కోహ్లీ, అనుష్కలు దగ్గరుండి వడ్డిస్తారని, కూర్చుని మాట్లాడుతూ ఉంటారని, ఇద్దరూ కలసి బయటకు వస్తారని, మిగతా ఆటగాళ్లనూ తన బంధు మిత్రుల్లానే కోహ్లీ భావిస్తాడని పొగడ్తల వర్షం కురిపించారు. ఓ కెప్టెన్ గా మైదానంలో ఎలా ఉండాలో అలానే కనిపించే కోహ్లీ, అతనిలోని దూకుడు తనకు ఎంతో నచ్చుతుందని చెప్పుకొచ్చారు. కాగా, కోహ్లీ కెప్టెన్సీలో గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరిగే మూడవ టెస్టులో భారత క్రికెట్ జట్టు పాల్గొననున్న సంగతి తెలిసిందే. పింక్ బాల్ తో ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగనుంది.


More Telugu News