రాజస్థాన్ బీజేపీ మాజీ చీఫ్ కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

  • మదన్‌లాల్ సైనీ సోదరుడి కుమారుడి కుటుంబం ఆత్మహత్య
  • కుమారుడి మృతితో కుంగిపోయిన కుటుంబం
  • అతడు లేకుండా జీవించడం దుర్భరమని సూసైడ్ నోట్
బీజేపీ రాజస్థాన్ మాజీ చీఫ్ మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మదన్‌లాల్ సైనీ 2019లో మృతి చెందారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో హనుమాన్ ప్రసాద్, ఆయన భార్య తార, వారి ఇద్దరు కుమార్తెలు అంజు, పూజ ఉన్నారు. వీరంతా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హనుమాన్ ప్రసాద్, తార దంపతుల పెద్ద కుమారుడు (17) గతేడాది సెప్టెంబరులో మృతి చెందాడు. అప్పటి నుంచి వీరంతా తీవ్రమైన మానసిక వ్యధలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఉద్యోగ్ నగర్ పోలీసులు, జిల్లా ఎస్పీ కున్వర్ రాష్ట్రదీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సికర్‌లోని శ్రీ కల్యాణ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుమారుడు లేకుండా జీవించడం కష్టమని, అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి నలుగురి మృతదేహాలు ఉరికి వేలాడుతున్నట్టు సికర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర శర్మ తెలిపారు. కుమారుడు చనిపోయిన తర్వాత వీరంతా మానసిక ఒత్తిడికి గురయ్యారని, వారి ఆత్మహత్యకు అదే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు చెప్పారు. బీజేజీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్‌ సైనీ సోదరుడి కుమారుడే హనుమాన్ ప్రసాద్ అని పోలీసులు తెలిపారు.


More Telugu News