కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్

  • కాంగ్రెస్ పార్టీని వీడిన కూన శ్రీశైలంగౌడ్
  • ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
  • శ్రీశైలం గౌడ్ కు కాషాయ కండువా కప్పిన జేపీ నడ్డా
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానం
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కూన శ్రీశైలం గౌడ్ ఈ సాయంత్రం బీజేపీలో చేరారు. అటు మేడ్చల్ డీసీసీ పదవికి కూడా రాజీనామా చేసిన శ్రీశైలం గౌడ్ నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీశైలం గౌడ్ కు కాషాయ కండువా కప్పిన జేపీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ ఛీఫ్ లక్ష్మణ్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు వివరిస్తూ, ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. విపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచి పోరాడడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే కాంగ్రెస్ ఆయనకు డీసీసీ పదవి ఇచ్చింది.


More Telugu News