ఏపీలో రేపు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు

  • రేపటితో ముగియనున్న పంచాయతీ ఎన్నికలు 
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
  • భారీగా పోలీసు బందోబస్తు
  • ఉదయం 6.30 నుంచి పోలింగ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం చివరిదశకు చేరుకుంది. రేపు రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 13 జిల్లాల్లోని 161 మండలాల్లో తుదివిడత ఎన్నికలు జరపనున్నారు. 3,299 సర్పంచ్ స్థానాలకు 554 ఏకగ్రీవం అయ్యాయి. 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సున్నితమైన ప్రాంతాలపై ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

కాగా, శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట మండలంలో పోలింగ్ సిబ్బంది గైర్హాజరుతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజర్వ్ సిబ్బంది కూడా రాకపోవడంతో వారి స్థానంలో అప్పటికప్పుడు ఉపాధ్యాయులను పోలింగ్ సిబ్బందిగా నియమించారు.

ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఆపై ఫలితాలు వెల్లడిస్తారు.


More Telugu News