భారత్ లో 7,569 కరోనా రకాలు... సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి

  • దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్
  • ప్రపంచవ్యాప్తంగా వేలాది కరోనా రకాలు
  • జన్యుమార్పులకు లోనవుతున్న వైరస్
  • భారత్ లోనే 5,898 రకాలుగా రూపాంతరం
గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భూతం అనేక జన్యు ఉత్పరివర్తనాలకు లోనైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల రకాలుగా మార్పు చెందిన వైరస్ లలో ఇదే మొదటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ క్రమంలో  సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో ఏకంగా 7,569 కరోనా రకాలను గుర్తించినట్టు తెలిపారు. వీటిలో భారత్ లో రూపాంతరం చెందిన కరోనా రకాలే 5,898 వరకు ఉన్నట్టు వివరించారు. పూర్తిస్థాయిలో నమూనాలు సేకరిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా 35 ప్రయోగశాలల్లో విస్తృత సంఖ్యలో కొవిడ్ నమూనాలను పరిశీలించిన మీదట నివేదిక రూపొందించారు. అయితే, జన్యుఉత్పరివర్తనాలకు లోనవుతున్న కరోనా వైరస్ రకాల్లో కొన్ని తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉందని సీసీఎంబీ తన అధ్యయనంలో పేర్కొంది. వాక్సిన్లు సహాయకారిగా ఉన్నా, మాస్కులు ధరించడం, భౌతికదూరం, శానిటైజర్ల వాడకం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.


More Telugu News