గెలిచిన మా అభ్యర్థుల వివరాలు వెబ్ సైట్లో ఉంచాం.. ఇందులో ఒక్కటైనా తప్పు ఉందని నిరూపించగలరా?: సజ్జల సవాల్

  • పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు ఒప్పుకోవాలి
  • వైసీపీ మద్దతుతో గెలిచిన వారి వివరాలను మేము వెబ్ సైట్లో పెట్టాం
  • కుప్పం ప్రజలను కూడా అవమానించేలా చంద్రబాబు మాట్లాడారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని పంచాయతీలను తామే కైవసం చేసుకున్నామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓటమిని చంద్రబాబు ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని అన్నారు.

 ప్రజలు చీత్కరించినా ఇంకా ఎవరిని మభ్యపెడతారని అన్నారు. ఎన్నికలలో వైసీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థుల వివరాలన్నింటినీ తాము వెబ్ సైట్లో ఉంచామని... ఇందులో ఒక్కటైనా తప్పు ఉందని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. తాము ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే... టీడీపీ మద్దతుతో గెలుపొందిన వారి వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించడం లేదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ, తీర్పునిచ్చారని... ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదని సజ్జల అన్నారు. దశాబ్దాల పాటు తనను గెలిపించిన ప్రజలను కూడా చంద్రబాబు అవమానించారని.. కుప్పం ప్రజలు డబ్బుల మాయలో ఓటు వేశారని కామెంట్ చేశారని విమర్శించారు. అలాంటి చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని అన్నారు. గతంలో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని.. చంద్రబాబుకు ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సంస్కారం ఇదేనని దుయ్యబట్టారు.


More Telugu News