విశాఖలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర ప్రారంభం!

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర‌ణ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పాద‌యాత్ర‌
  • గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన విజ‌యసాయిరెడ్డి
  • మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో క‌లిసి పాద‌యాత్ర‌
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఉద‌యం జీవీఎంసీ గాంధీ విగ్రహానికి ముందుగా ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆయ‌న పాద‌యాత్ర‌ కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ఆర్చ్‌ వరకు మొత్తం 25 కిలోమీట‌ర్ల‌ మేర కొన‌సాగుతుంది. ఈ రోజు సాయం‌త్రం ఈ పాద‌యాత్ర ముగిశాక‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వ‌హిస్తారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు ప‌రం కాకుండా ర‌క్షించేందుకే ఆ యాత్ర చేపడుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకే ఈ  పాదయాత్ర చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం, రుణాలను ఈక్విటీ రూపంలో మార్చడం వంటి అంశాల విషయమై ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం జ‌గ‌న్  ప్రతిపాదన‌లు చేశార‌ని తెలిపారు. కార్మికులకు తాము అండ‌గా ఉంటామ‌ని ఈ పాద‌యాత్ర ద్వారా చాటి చెబుతామ‌ని అన్నారు.


More Telugu News