కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనల్లో పాల్గొనవద్దు: సోము వీర్రాజు

  • విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • వైసీపీ, టీడీపీలను ఉద్యోగులు నమ్మవద్దని హితవు
  • ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టీకరణ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, కమ్యూనిస్టులు తమ పంథాలో ముందుకు వెళుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.  స్టీల్ ప్లాంట్ అంశంలో నిరసనలు నిలుపుదల చేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలలో పాల్గొనవద్దని కోరారు. ఆందోళన కలిగించేలా వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగులు నమ్మవద్దని సూచించారు.

2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి గట్టి కూటమిగా ఉంటుందన్న భయంతో వైసీపీ, టీడీపీ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అంశంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, ఆలయాలపై దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయం తెలియకుండానే ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయని తెలిపారు.

ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని అపహాస్యం చేయాలనే విశాఖ అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. ఎంతో చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నిర్ణయం తీసుకోకముందే నిరసనలు చేయడం సరికాదని హితవు పలికారు.


More Telugu News