వైసీపీ, టీడీపీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి: జీవీఎల్ నరసింహారావు

వైసీపీ, టీడీపీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి: జీవీఎల్ నరసింహారావు
  • వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్రం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు
  • రాజకీయ ప్రయోజనాలే వైసీపీ, టీడీపీలకు ముఖ్యం
  • రామతీర్థం ఘటనలో ఇంతవరకు అరెస్టులు జరగలేదు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ, టీడీపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనే అంతిమ నిర్ణయం తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుందని ఆయన అన్నారు. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకున్నా... ఈ అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ వైసీపీ, టీడీపీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఇంతవరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఏపీకి కియా మోటార్స్ వస్తే ఆ ఘనత తమదేనంటూ చంద్రబాబు, జగన్ ఇద్దరూ చెప్పుకున్నారని... ప్రైవేటు సంస్థలు వస్తే రాష్ట్రం ఇబ్బందులపాలు అవుతుందని వారు ఇప్పుడు అనడం సరికాదని అన్నారు. ఉద్యోగుల భద్రత, స్థానికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలే టీడీపీ, వైసీపీలకు ముఖ్యమని మండిపడ్డారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించిన ఘటనలో ఇంత వరకు ఎవరీనీ అరెస్ట్ కూడా చేయలేదని దుయ్యబట్టారు.


More Telugu News