ప్రభుత్వ అధికారులకు విద్యుత్ వాహనాలను అందిస్తాం: గడ్కరీ

  • 10 వేల విద్యుత్ వాహనాలను వాడితే నెలకు రూ. 30 కోట్లు ఆదా అవుతుంది
  • తొలుత మా శాఖలోనే విద్యుత్ వాహనాలను వినియోగిస్తాం
  • ఢిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్ లకు విద్యుత్ బస్ సర్వీసులను ప్రారంభిస్తాం
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఇప్పటికే తప్పనిసరి చేయాల్సి ఉండాల్సిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఒక్క ఢిల్లీలోనే 10 వేల ప్రభుత్వ విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రారంభిస్తే... నెలకు రూ. 30 కోట్లు ఆదా అవుతుందని ఆయన చెప్పారు. తమ శాఖలో త్వరలోనే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తన ఆలోచనను పరిశీలించాల్సిందిగా కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ ను కోరారు. 'గో ఎలక్ట్రిక్' ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

ఢిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్ లకు త్వరలోనే విద్యుత్ బస్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు గడ్కరీ తెలిపారు. అంతేకాదు... వంట గ్యాస్ కు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్టుగానే.. విద్యుత్ తో పని చేసే వంట పరికరాలకు సబ్సిడీ ఇవ్వడం కూడా సముచితమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు గ్యాస్ పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు.


More Telugu News