ఈసారి కౌన్సిలర్ గా నిలబడుతున్నా... ఐదేళ్లు ఇంకే పదవీ వద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు జేసీ వెల్లడి
  • ప్రజాసేవే తనకు ముఖ్యమని ఉద్ఘాటన
  • ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా
  • తనకు ఏ కోరికలు లేవని స్పష్టీకరణ
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీచేస్తున్నానని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లపాటు తనకు ఇంకే పదవి వద్దని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఐదుగురు చైర్మన్లు అవుతారు, ఐదుగురు వైస్ చైర్మన్లు అవుతారు... నేను మాత్రం కౌన్సిలర్ గానే ఉంటా అని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపల్ సమావేశాల్లో ఎన్నడూ వేదిక ఎక్కలేదని, ఇప్పుడు కూడా తాను వేదిక కిందే కౌన్సిల్ లో ఓ సభ్యుడిగా ఉంటానని అన్నారు.

తనకు 68 ఏళ్లని, తనకు ఏ కోరికలు లేవని జేసీ చెప్పారు. ప్రజాసేవే తనకు ముఖ్యమని, ఇంతకుముందు కూడా చేసి చూపించానని ఉద్ఘాటించారు. ప్రజలు తనవైపే ఉన్నారని, పురపాలక ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించారని, తాను తాడిపత్రిలో పుట్టినందుకు  అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.


More Telugu News