అర్జున్ టెండూల్కర్ ని ప్రతిభ ఆధారంగానే తీసుకున్నాం: మహేల జయవర్ధనే

  • రూ. 20 లక్షలకు అర్జున్ ని తీసుకున్న ముంబై జట్టు
  • అర్జున్ గొప్ప ఆటగాడు అవుతాడన్న మహేల 
  • అర్జున్ ది కష్టపడే మనస్తత్వమన్న జహీర్ ఖాన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ వేలంపాటలో ముంబై ఇండియన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మినీ ఆక్షన్ లో అర్జున్ ను ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. దీనిపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ, కేవలం ప్రతిభ ఆధారంగానే ముంబై జట్టులోకి అర్జున్ ప్రవేశించాడని చెప్పారు. క్రికెట్ గురించి మరింత నేర్చుకునేందుకు అర్జున్ కు ముంబై ఇండియన్స్ ఉపయోగపడుతుందని, అర్జున్ గొప్ప ఆటగాడిగా తయారవుతాడని అన్నారు.

సచిన్ కుమారుడు అనే పెద్ద ట్యాగ్ అర్జున్ కు ఉందని... కానీ, అదృష్టం కొద్దీ అతను బౌలర్ అని, బ్యాట్స్ మెన్ కాదని జయవర్ధనే చెప్పారు. అర్జున్ ఇప్పుడిప్పుడే ముంబైకి ఆడుతున్నాడని, ఇప్పుడు ముంబై ఫ్రాంచైజీకి ఆడుతాడని అన్నారు. అర్జున్ పై ఎక్కువ ఒత్తిడి ఉంచరాదని, అతనికి సమయం ఇవ్వాలని చెప్పారు.

అర్జున్ గురించి ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ, అతనితో నెట్స్ లో తాను చాలా సమయాన్ని గడిపానని, కొన్ని ట్రిక్స్ నేర్పానని చెప్పాడు. అర్జున్ ది కష్టపడే మనస్తత్వమని అన్నాడు. నేర్చుకోవాలనే తపన అర్జున్ లో ఉందని అన్నాడు. సచిన్ కుమారుడు అనే ఒత్తిడి మాత్రం అర్జున్ పై ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.


More Telugu News