విజయసాయిరెడ్డిది విశాఖ స్టీల్ ప్లాంట్ 'భక్షణ ఆరాట యాత్ర': టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

  • విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • పరిరక్షణ పోరాట యాత్ర సాగిస్తానన్న విజయసాయి
  • భూ కబ్జాల కోసమే యాత్ర అంటూ అయ్యన్న ఆరోపణ
  • చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
  • జగన్, విజయసాయి ఢిల్లీలో సత్తా చూపాలని వ్యాఖ్య  
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో విశాఖ పరిధిలోని నియోజకవర్గాల్లో ఈ నెల 20న ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.

దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. విజయసాయిరెడ్డిది విశాఖ స్టీల్ ప్లాంట్ 'భక్షణ ఆరాట యాత్ర' అని విమర్శించారు. జగన్ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా 7 వేల ఎకరాలు అమ్మేస్తాం అని ప్రకటించాడని, ఆ ప్రకటన వచ్చిన వెంటనే, కబ్జా చెయ్యాల్సిన భూమిని సర్వే చేయడం కోసం యాత్ర పేరుతో విజయసాయి రంగంలోకి దిగాడని అయ్యన్న ఆరోపించారు.

అమ్మేసే పేరుతో కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకోవద్దు అని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వైసీపీ డ్రామాలు చూసి ఆర్టిస్టులే ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి, సాయిరెడ్డి ఏపీలో చిందులు ఆపి ఢిల్లీలో తమ సత్తా చూపితే బాగుంటుందని అన్నారు. 


More Telugu News