అరుణగ్రహంపై అమెరికా రోవర్... రెండు ఫొటోలతో పని ప్రారంభం

  • పర్సెవరెన్స్  రోవర్ ను ప్రయోగించిన నాసా
  • అంగారకుడిపై విజయవంతంగా ల్యాండింగ్
  • ఫొటోలను గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిన రోవర్
  • నాసా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకం 
  • రెండేళ్లపాటు పరిశోధనలు సాగించనున్న  పర్సెవరెన్స్  
రోదసిలో సుదూరంగా ఉండే అరుణగ్రహం అంగారకుడిపై అమెరికా రోవర్ పర్సెవరెన్స్    కాలుమోపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఈ రోవర్ అంగారకుడి మధ్యరేఖ సమీపంలోని జెజేరో అనే బిలం వద్ద దిగింది. ల్యాండైన వెంటనే  పర్సెవరెన్స్   రోవర్ పని కూడా ప్రారంభించింది. అంగారకుడి ఉపరితలాన్ని రెండు ఫొటోలు తీసి నాసా కేంద్రానికి పంపింది.  పర్సెవరెన్స్   రోవర్ ప్రయోగించిన ఉద్దేశం ఏంటంటే... అరుణగ్రహంపై ఉండే రాళ్లు, ఉపరితల భాగం కింద ఉండే మట్టి నమూనాలను సేకరించి, గతంలో ఇక్కడ జీవం ఉండేదా? అన్న విషయాన్ని విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు పంపనుంది.

ప్రస్తుతం  పర్సెవరెన్స్  రోవర్ ల్యాండైన జెజేరో బిలం ఉన్న ప్రాంతంలో వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ సరస్సు ఉండి ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్ విజయవంతంగా దిగడం పట్ల నాసా శాస్త్రవేత్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాలోని పసడెనా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో ఆనందం మిన్నంటింది. కాగా, ఈ రోవర్ అంగారకుడి ఉపరితలంపై రెండేళ్లపాటు పరిశోధనలు సాగించనుంది. ఇక్కడ జీవజాలం మనుగడకు అవకాశం ఉందా? అనే అంశాన్ని పర్సెవరెన్స్    విశ్లేషించనుంది.


More Telugu News