పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాచించడం ఇంకెంతకాలం?: పవన్ కల్యాణ్

  • మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పవన్ వ్యాఖ్యలు
  • తమ మద్దతుదారులు గణనీయ విజయాలు సాధించారన్న పవన్
  • 270కి పైగా పంచాయతీల్లో సత్తా చాటారని వెల్లడి
  • నాలుగో దశలోనూ ఇదే జోరు కొనసాగించాలని పిలుపు
మూడో విడత పంచాయతీ ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తొలి రెండు దశల తరహాలోనే మూడో దశలోనూ జనసేన మద్దతుదారులు గణనీయమైన విజయాలు సాధించారని పవన్ వెల్లడించారు. నాలుగోదశలోనూ ఇదే జోరు కొనసాగించాలని, ఆడపడుచులు, యువత ఇదే స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు వస్తున్నాయని, అలాంటప్పుడు గ్రామ పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద యాచించడం ఇంకెంతకాలం? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాలు తమ కబంధ హస్తాల్లో ఉంచుకుని పంచాయతీలను యాచించే స్థాయికి తీసుకువచ్చాయని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్న కొంతమందికి ఆ నిధుల్లోంచి కాస్తో కూస్తో విదల్చడం తప్ప గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంలేదని అన్నారు. యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో పంచాయతీలు ఉండాలన్నదే జనసేన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మూడో విడత ఎన్నికల ఫలితాల గురించి చెబుతూ, 2,639 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు దక్కాయని... 1,654 పంచాయతీల్లో జనసేన బలపర్చిన అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారని వివరించారు.


More Telugu News