వైసీపీకి ఆదరణ తగ్గిందనే విషయం జగన్ పర్యటనతో తేలిపోయింది: రఘురామకృష్ణరాజు

  • వైజాగ్ ప్లాంట్ విషయంలో జగన్ నిస్సహాయతను వ్యక్తం చేశారు
  • అఖిలపక్షంతో కలసి ప్రధాని మోదీని జగన్ కలవాలి
  • రాజధాని వద్దు అనే భావన విశాఖ ప్రజల్లో కనపడుతోంది
విశాఖలో వైసీపీకి ప్రజాదరణ తగ్గిందనే విషయం ముఖ్యమంత్రి జగన్ పర్యటనతో తేలిపోయిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే విషయంలో జగన్ నిస్సహాయతను వ్యక్తం చేశారని అన్నారు. లేఖలతో సరిపెట్టకుండా జగన్ అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీని కలవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం గురించి జగన్ మాట్లాడారని... అది సరైన నిర్ణయం కాదని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా జగన్ చర్యలు ఉండాలని చెప్పారు.

విశాఖలో రాజధాని వద్దు అనే భావన ఆ నగర ప్రజల్లో కనపడుతోందని రఘురాజు అన్నారు. 'విశాఖ రాజధాని వద్దు, అమరావతి ముద్దు' అనే నినాదంతో అందరూ ముందుకు సాగాలని చెప్పారు. విశాఖలో వివిధ కార్పొరేషన్ల కార్యాలయాలను ఏర్పాటు చేస్తామంటున్నారని... దీనివల్ల అనవసరమైన ఖర్చు అవుతుందని... ఇప్పటికే ఎంతో ప్రజాధనం దుర్వినియోగమయిందని అన్నారు. జగన్ కు పరభాషా వ్యామోహం ఉందని విమర్శించారు. మాతృభాషలో భోదనపై కేంద్రం ఒక విధానాన్ని తీసుకొచ్చిందని... అయినా ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లీషు భాష లేని చైనా ఏ విధంగా అభివృద్ధిని సాధించిందో గమనించాలని సూచించారు. ఇంగ్లీషు భాష అన్నింటికీ పరిష్కారం కాదని చెప్పారు.


More Telugu News