మాజీ సీజేఐ గొగోయ్​ పై కుట్ర జరిగి ఉండొచ్చు: సుప్రీంకోర్టు

  • ఆయనపై లైంగిక ఆరోపణలలో నిజం లేదు
  • ఎన్నార్సీపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో కుట్ర పన్ని ఉండొచ్చు
  • కోర్టు రిజిస్ట్రీని దారిలో పెట్టేందుకూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు
  • కేసును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ పై కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల కేసును కొట్టిపారేసింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ), సుప్రీం కోర్టు రిజిస్ట్రీని దారిలో పెట్టడం కోసం చేసిన ప్రయత్నాల వల్లే ఆయనపై ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది.

మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయనపై కుట్ర పూరితంగా వ్యవహరించేందుకు ఎవరైనా మధ్యవర్తులుగానీ, లేదా కోర్టులోని లోపలి వ్యక్తులే బయటి వ్యక్తులకు సహకరిస్తున్నారా? అన్న విషయాలను తేల్చేందుకు అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు కమిటీని వేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే కోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా జస్టిస్ ఏకే పట్నాయక్ టీమ్ నివేదికను ఇచ్చింది.

కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమంటూ జస్టిస్ పట్నాయక్ నివేదిక పేర్కొందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ రికార్డులు ప్యానెల్ కు అందుబాటులో లేవంది. కోర్టును మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు జస్టిస్ గొగోయ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పింది. ఎన్నార్సీపైనా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, కానీ, కొన్ని వర్గాలకు అవి నచ్చలేదని నిఘా విభాగం కూడా ఓ నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలోనే జస్టిస్ గొగోయ్ పై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ కేసును కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపితమైందని పేర్కొంది.


More Telugu News