దేశ వ్యాప్తంగా రైల్ రోకో.. ప్ర‌యాణికుల ఇబ్బందులు

  • ఉత్త‌ర భార‌త్‌లో ప‌లు రైళ్లు ర‌ద్దు
  • ఆల‌స్యంగా న‌డుస్తోన్న‌ మ‌రికొన్ని రైళ్లు
  • కాచిగూడ‌లో రైల్ రోకో
  • పాల్గొన్న చాడ వెంక‌ట్ రెడ్డి
ఎన్డీఏ స‌ర్కారు తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైల్ రోకో ప్రారంభ‌మైంది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్త‌ర భార‌త్‌లో ప‌లు రైళ్లు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. హ‌ర్యానాలో ప‌లు ప్రాంతాల్లో రైళ్లు ముందుకు క‌ద‌ల‌కుండా రైతులు రైల్వే ట్రాక్ ల‌పై ఆందోళ‌నకు దిగారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లోనూ సాగుచ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు రైల్ రోకోలో పాల్గొని ఆందోళ‌న‌లు చేస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల అంశాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌త్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  రైల్వే శాఖ అప్రమత్త‌మై ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది.  

ఆందోళనలు శాంతియుతంగా జ‌ర‌పాల‌ని ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్ చెప్పారు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. నిఘా వర్గాల సాయం తీసుకుంటామ‌న్నారు. ముఖ్యంగా పంజాబ్ తో పాటు హర్యానా, యూపీ, పశ్చిమబెంగాల్ సహా ఇతర కొన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టామ‌ని చెప్పారు.

కాగా, ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రైల్ రోకో నిర్వ‌హిస్తామ‌ని రైతులు అంటున్నారు. శాంతి యుతంగా రైళ్లు నిలిపి వేస్తామ‌ని చెప్పారు. అలాగే, నిలిచిన రైళ్ల‌లోని ప్ర‌యాణికుల‌కు ఆహారం, నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు.
 
తెలంగాణ‌లోనూ రైల్ రోకో ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. సాగు చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ కాచిగూడ రైల్వే స్టేష‌న్‌లో రైల్ రోకో చేప‌ట్టారు. అక్క‌డ నిర్వ‌హించిన రైల్ రోకోలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంక‌ట్ రెడ్డితో పాటు వామ‌ప‌క్ష నేత‌లు పాల్గొన్నారు.


More Telugu News