సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసేందుకు హెలికాప్టర్ లో వచ్చాడు!

  • మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన పారిశ్రామికవేత్త జలిందర్ గగరె
  • తన స్వగ్రామం అంబీ దుమాలాలో గెలుపొందిన వైనం
  • ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు 
ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. గెలిచిన తర్వాత మందీమార్బలంతో, డప్పుల చప్పుళ్లతో, బాణసంచా కాలుస్తూ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ప్రమాణస్వీకారానికి ఏకంగా హెలికాప్టర్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే పారిశ్రామికవేత్త జలిందర్ గగరె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అహ్మద్ నగర్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం అంబీ దుమాలాలో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన పూణెలో ఉంటారు. గెలుపొందిన తర్వాత ప్రమాణస్వీకారం చేసే రోజు వచ్చింది.

దీంతో, పూణె నుంచి ఆయన హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, గ్రామంలోని ఆలయాలపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. హెలికాప్టర్ నుంచి దిగిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. మరోవైపు జలిందర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసమే తాను సర్పంచ్ గా పోటీ చేశానని చెప్పారు.


More Telugu News