విశాఖలో పోస్కో సంస్థను అడుగుపెట్టనివ్వను: వైజాగ్ స్టీల్ కార్మిక నేతలతో జగన్

  • కేంద్ర ప్రభుత్వం మనసు మారుతుందని భావిస్తున్నా
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
  • పోస్కోతో కడప, భావనపాడు, కృష్ణపట్నంలో పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తాం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయ్యే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి జగన్ తమతో అన్నారని ప్లాంట్ కు చెందిన కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విశాఖకు వెళ్లిన జగన్ ను నేతలు ఎయిర్ పోర్టులో కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీఎంతో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. కార్మిక నేతలు తమ వినతి పత్రాన్ని జగన్ కు అందించారు.

ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని జగన్ చెప్పారని వారు తెలిపారు. కార్మిక నేతలు చెప్పిన వివరాల ప్రకారం దేవుడి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం మనసు మారుతుందని భావిస్తున్నట్టు జగన్ చెప్పారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని అన్నారు. పోస్కో సంస్థతో కడప, భావనపాడు, కృష్ణపట్నంలో పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని సీఎంకు కార్మిక నేతలు తెలిపారు.


More Telugu News