దేశ ద్రోహ చట్టమున్నది శాంతి భద్రతల పరిరక్షణకు తప్ప గొంతు నొక్కేయడానికి కాదు: ఢిల్లీ కోర్టు

  • దుండగుల ముసుగులో చట్టం ప్రయోగించడం మంచిది కాదని హితవు
  • ఇద్దరు వ్యక్తుల కేసులో కోర్టు వ్యాఖ్యలు
  • తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందని అసహనం
  • సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించారన్న పోలీసులు
  • ఆ వీడియో అలా ఏమీ లేదని తోసిపుచ్చిన జడ్జి
దేశ ద్రోహ చట్టం చాలా శక్తిమంతమైనదని, దానిని సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు వాడాలే తప్ప.. ఎదుటి వారి గొంతు నొక్కేయడానికి వాడరాదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. దుండగుల ముసుగులో ఆ చట్టం ప్రయోగించడం మంచిది కాదని హితవు పలికింది.

వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి మద్దతుగా దేవీ లాల్ బర్దక్, స్వరూప్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేస్తున్నారని, ఫేక్ వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాన్ని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా విచారించారు.

‘‘సాగు చట్టాల ఆందోళనలకు సంబంధించి హింసను ప్రేరేపించేందుకు వారు ప్రయత్నించారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న పోలీసుల వాదనలకు సరైన ఆధారాలు లభించలేదు. కాబట్టి వారిపై దేశద్రోహ చట్టాన్ని తప్పుగా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. వారిద్దరి మీదా తప్పుడు కేసులు బనాయించినట్టు అర్థమవుతోంది. నా అభిప్రాయం మేరకు దీని మీద లోతైన చర్చ జరగాలి’’ ఆని ఆయన వ్యాఖ్యానించారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా 200 మంది పోలీసులు రాజీనామా చేశారంటూ ఓ వీడియోను వారిద్దరూ పోస్ట్ చేశారని, వాస్తవానికి పరిస్థితులను ఎలా డీల్ చేయాలో సిబ్బందికి ఆ వీడియోలో పోలీస్ అధికారి సూచిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే, దానికి స్పందించిన జడ్జి.. తానే స్వయంగా కోర్టు రూములో ఆ వీడియో చూశానన్నారు.

అందులో రైతులకు అనుకూలంగా ఆ పోలీస్ అధికారి నినాదాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అక్కడి వాతావరణం కూడా అలాగే ఉందన్నారు. అయితే, ఆ వీడియోను ఒరిజినల్ గా పోస్ట్ చేసింది నిందితులు కాదని, కేవలం ఫార్వర్డ్ మాత్రమే చేశారని దర్యాప్తులో తేలినట్టు గుర్తు చేశారు.


More Telugu News