అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుని మా వాళ్లు నిలిచారు... గణాంకాలే అందుకు నిదర్శనం: పవన్ కల్యాణ్

  • ఏపీలో తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి
  • గ్రామాల్లో జనసేన బలంగా ఉందని వెల్లడైందన్న పవన్
  • మార్పు మొదలైందని ఉద్ఘాటన
  • అధికార పక్షం కండబలం చూపిస్తోందని ఆరోపణ
ఏపీలో తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తలు, నేతలు అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులకు ఎదురొడ్డి నిలిచారంటూ కొనియాడారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయని, జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో 18 శాతానికి పైగా ఓట్లు లభించాయని, రెండో విడతలో 22 శాతం దాటిందని వెల్లడించారు. రెండో విడతలో 250కి పైగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలిచామని, 1500 వార్డులను చేజిక్కించుకున్నామని తెలిపారు.

మార్పు మొదలయ్యేటప్పుడే అవతలి పక్షం వాళ్లు భయపెట్టేందుకు ప్రయత్నిస్తారని, అధికారపక్షం వాళ్లు కండబలం చూపిస్తున్నారని విమర్శించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వలంటీర్ల పరిధిలోని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వివరించారు. రకరకాలుగా బెదిరిస్తున్నారని, ప్రత్యర్థులను కిడ్నాప్ చేయిస్తున్నారని వెల్లడించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనసేన పార్టీ అంటే ఎందుకంత భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. జనసైనికులు, ఆడపడుచులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

అయితే ఏకగ్రీవాలు ఏ రకంగా చూసినా మంచిది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోటీతత్వం ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేరళ తరహాలో పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావాలని, పంచాయతీలకు స్వయంప్రతిపత్తి కల్పించేంత వరకు జనసైనికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేరళలో ఏకగ్రీవాలు చాలా తక్కువ అని వెల్లడించారు. గ్రామాల్లో పనులకు ఎంతెంత ఖర్చు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం సర్పంచ్ కే ఉండాలని, కానీ మన దౌర్భాగ్యం కొద్దీ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.


More Telugu News