మధ్యప్రదేశ్ బస్సు దుర్ఘటనలో 40కి పెరిగిన మృతుల సంఖ్య

  • అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
  • పూర్తిగా మునిగిపోయిన బస్సు
  • బస్సులో 60 మంది ప్రయాణికులు!
  • ఏడుగురిని కాపాడామన్న అధికారులు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు, మోదీ
  • మధ్యప్రదేశ్ లో అమిత్ షా పర్యటన రద్దు
మధ్యప్రదేశ్ లో ఓ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 60 మందితో ప్రయాణిస్తున్న బస్సు సిధి జిల్లాలోని పట్నా గ్రామం వద్ద కాలువలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 40 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో అనేక మృతదేహాలను వెలికితీశారు. బస్సు పూర్తిగా నీట మునగడంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. కాగా, ఈ ప్రమాదం నుంచి ఏడుగురిని కాపాడామని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. అటు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

కాగా, ఈ ప్రమాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన  పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, బస్సు దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.


More Telugu News