బ్యాంకులకు రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టిన 25 తెలుగు సంస్థలు: ఆర్బీఐ

  • ఎగవేతదారుల జాబితాను విడుదల  చేసిన టాప్ బ్యాంక్
  • వంద కోట్ల పైన రుణాలకు సంబంధించిన జాబితాలో 296 కంపెనీలు
  • రూ.లక్షా 25 వేల కోట్ల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ
  • రూ.కోటి ఆపైన రుణాలకు సంబంధించి ఉద్దేశపూర్వక డీఫాల్టర్లుగా 2,203 సంస్థలు
  • రూ.1.66 లక్షల కోట్ల మేర ఎగవేత
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.10 వేల కోట్లు! ఇది, తెలుగు రాష్ట్రాలకు చెందిన 25 సంస్థలు.. బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము. ఆ సంస్థల్లో చాలా వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బ్యాంకుల్లో వంద కోట్లు ఆపై మొత్తం రుణంగా తీసుకుని, కట్టని సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఆర్బీఐకి పెట్టుకున్న సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగు చూశాయి.

2020 సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 296 సంస్థలు.. రూ.లక్షా 25 వేల కోట్లు ఎగ్గొట్టాయని ఆర్బీఐ సమాధానమిచ్చింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 పెద్ద సంస్థలూ.. రూ.9,975 కోట్లను ఎగవేశాయని తెలిపింది. రూ.కోటి ఆపైన మొత్తం విషయంలో చూస్తే.. దేశవ్యాప్తంగా 2,203 సంస్థలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయని, రూ.1.66 లక్షల కోట్లు ఎగవేశాయని పేర్కొంది.

ప్రముఖ వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.5,747 కోట్లు బ్యాంకులకు కట్టకుండా మోసానికి పాల్పడిందని వివరించింది. ఇక, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డెక్కన్ క్రానికల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,801 కోట్లు, వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,331 కోట్లు ఎగ్గొట్టినట్టు పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన టెలికాం సర్వీసెస్ కంపెనీ బీఎస్ లిమిటెడ్ రూ.754 కోట్ల మేర ఎగవేసినట్టు తెలిపింది. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ గ్రూప్ కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారేనని ఆర్బీఐ తన జాబితాలో వెల్లడించింది. ఈ సంస్థ రూ.674 కోట్లు ఎగవేసింది.

ప్రజలు డిపాజిట్ చేసుకున్న సొమ్ము నుంచి సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, వారి నుంచి రుణాలు వసూలు చేయలేకపోతే.. వెంటనే ప్రజలకు వారి సొమ్మును తిరిగిచ్చేయాలని ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. ఎగవేతదారుల కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టాలకు సవరణ చేయాలన్నారు.


More Telugu News