‘టూల్ కిట్’ జూమ్ సమావేశంలో పాల్గొన్నా.. దానితో నాకేం సంబంధం లేదు: నికితా జాకబ్

  • పోలీసులకు లాయర్ ద్వారా నోటీసులు పంపిన ముంబై లాయర్
  • ఎక్స్ టెన్షన్ రెబెలియన్స్ కార్యకర్తలే దానిని తయారు చేశారని వెల్లడి
  • అందులో హింసను ప్రేరేపించే అంశాలు లేవని స్పష్టీకరణ
  • తనకు మత, రాజకీయ, ఆర్థిక ఎజెండాలేవీ లేవని వ్యాఖ్య 
గణతంత్ర దినోత్సవ హింసకు ముందు రోజు జరిగిన జూమ్ మీటింగ్ కు తానూ హాజరయ్యానని.. టూల్ కిట్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ముంబై లాయర్ నికితా జాకబ్ అంగీకరించారు. ఆ సమావేశంలో పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) వ్యవస్థాపకుడు మో ధలివాల్ తో పాటు దిశా రవి హాజరయ్యారని చెప్పారు. ముంబై పోలీసులకు ఆమె తరఫు లాయర్ సమర్పించిన పత్రంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

భారత్ కు చెందిన ఎక్స్ టెన్షన్ రెబెలియన్ (ఎక్స్ఆర్)కు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలే టూల్ కిట్ ను తయారు చేశారని, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే దానిని రూపొందించారని ఆ పత్రంలో నికిత పేర్కొన్నారు. అయితే, గ్రెటా థన్ బర్గ్ తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, దీనిపై గ్రెటాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఇది కేవలం సమాచారంతో కూడిన పత్రమేనని, హింసకు ప్రేరేపించే అంశాలు అందులో లేవని చెప్పారు.

రైతు ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు తయారు చేసిన ఈ టూల్ కిట్ వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్ర లేదని నికిత స్పష్టం చేశారు. ఇందులో తనకు మత, రాజకీయ, ఆర్థిక ఎజెండాలంటూ ఏవీ లేవని తేల్చి చెప్పారు. అయితే, మో ధలివాల్ సహచరుడు, కెనడాకు చెందిన పునీత్.. నికితా జాకబ్ ను కలిశారని, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో రైతు ఉద్యమంపై ట్విట్టర్ లో ఒక తుపాను సృష్టించాలని ఆమెకు సూచించారని పోలీసులు చెబుతున్నారు.


More Telugu News