తెలంగాణ‌లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల

  • నేటి నుంచి ‌ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీక‌ర‌ణ‌
  • ఆ త‌ర్వాతి రోజే నామినేషన్ల పరిశీల‌న
  • మార్చి 14న పోలింగ్, 17న‌  ఓట్ల  లెక్కింపు  
తెలంగాణ‌లోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ తో పాటు వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి ఎన్నికల అధికారి, గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్‌ అదనపు కమిషనర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అలాగే, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

దీంతో నేటి నుంచి నామినేషన్లను స్వీక‌రిస్తున్నారు.  ఈ నెల 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆ త‌ర్వాతి రోజే నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. మార్చి 14న పోలింగ్, 17  ఓట్ల  లెక్కింపు ఉంటుంది.

కాగా, ఆయా ఎమ్మెల్సీ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల‌ను ప్రకటించింది.  వరంగల్‌-ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్‌, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ అభ్య‌ర్థిగా చిన్నారెడ్డి పేర్ల‌ను ఖరారు చేసింది.

అలాగే, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఇదే స్థానం నుంచి టీజేఎస్ అధ్య‌క్షుడు కోదంరాం పోటీ చేస్తున్నారు. మిగ‌తా పార్టీలూ త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నాయి. ఈ స్థానంలో పోటీ బాగా ఉండ‌నుంది.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ అభ్య‌ర్థిగా  బీజేపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న‌కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి.  టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ పోటీలో నిలవ‌నున్నారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్ ‌ఇంకా అభ్య‌ర్థిని ప్రకటించలేదు.


More Telugu News