పార్లమెంట్​ ప్రాంగణంలోనే రేప్​ చేశారని మాజీ ఉద్యోగిని ఆరోపణ.. ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణ!

  • 2019 నాటి ఘటనను ఇంటర్వ్యూలో గుర్తు చేసిన ప్రధాని మాజీ సలహాదారు
  • ఇంట్లో దిగబెడతానన్న సహోద్యోగి పార్లమెంట్ కు తీసుకెళ్లాడని వెల్లడి
  • తాగిన మైకంలో మంత్రి ఆఫీసులోనే నిద్రపోయానన్న మహిళ
  • అదును చూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆవేదన
  • ఆస్ట్రేలియా పార్లమెంట్ లో దుమారం.. క్షమాపణ కోరిన స్కాట్ మోరిసన్
  • ప్రతి ఉద్యోగినికీ భద్రత కల్పిస్తామని హామీ
పార్లమెంటు ప్రాంగణంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆస్ట్రేలియా మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జరిగిన సంఘటనకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తాజాగా క్షమాపణలు కోరారు. సోమవారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధిత మహిళ, ప్రధాని మోరిసన్ కు మాజీ రాజకీయ సలహాదారు అయిన బ్రిటానీ హిగిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019లో తాను రక్షణ శాఖ మంత్రి లిండా రీనాల్డ్స్ వద్ద ఉద్యోగంలో చేరానని హిగిన్స్ చెప్పారు. ఆఫీసులోనే తనతో పాటు పనిచేసే ఓ సీనియర్ సహోద్యోగి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన చెందారు. ఓ రోజు టీంతో కలిసి డ్రింక్స్ కు వెళ్లామని, రాత్రి పొద్దుపోవడంతో ఇంటి వద్ద దిగబెడతానంటూ ఆ సీనియర్ ఉద్యోగి అన్నాడని చెప్పారు. తాను దానికి అంగీకరించి కారు ఎక్కానని, అయితే, అతడు ఇంటికి తీసుకెళ్లకుండా పార్లమెంట్ భవనం దగ్గరకు తీసుకెళ్లాడని ఆరోపించారు.

అయితే, తాగిన మైకంలో తనకు అక్కడే మంత్రి ఆఫీసులో నిద్ర పట్టిందన్నారు. తను మైకంలో ఉండగానే అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దాంతో మెలకువ వచ్చి అరిచినా వదల్లేదని హిగిన్స్ వెల్లడించారు. తర్వాత వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొంది. ఈ విషయంపై వెంటనే ఫిర్యాదు చేయగా.. ఆ సీనియర్ ఉద్యోగిని కాపాడేందుకు మంత్రి రీనాల్డ్స్ ప్రయత్నాలు చేసినట్టు తెలిసిందన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న తనకు బెదిరింపులు ఎదురయ్యాయని వాపోయారు. ఉద్యోగం కూడా కోల్పోయానని ఆరోపించారు. తనపై అత్యాచారం చేసిన వ్యక్తికి అధికార లిబరల్ పార్టీలో ప్రాధాన్యం ఉందని చెప్పుకొచ్చారు.

ఆమె వ్యాఖ్యలు సోమవారం ఆస్ట్రేలియా పార్లమెంట్ ను కుదిపేశాయి. వ్యవహారంపై విచారణ జరిపించాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఫిర్యాదుల పద్ధతిని సమీక్షించాలన్న డిమాండ్లు వినిపించాయి. ప్రధాని మోరిసన్ స్వయంగా బాధితురాలిని క్షమాపణ కోరారు. రక్షణ మంత్రి ఆఫీసులోనే ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు.

పార్లమెంట్ వృత్తిగత సంస్కృతిపై సమీక్ష చేస్తామని సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రతి యువ ఉద్యోగినికీ భద్రత కల్పించే హామీ తమదని చెప్పారు. ఘటన విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ భవనమే అత్యంత సురక్షితం కాదని మరోసారి రుజువైందని మండిపడుతున్నారు.


More Telugu News