ఎన్నిక‌ల్లో పోటీ కోసం ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోన్న క‌మ‌ల్.. దరఖాస్తు రుసుం రూ.25 వేలు!

  • త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీల‌కు మేలో ఎన్నికలు
  • పార్టీయేతర నేత‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌తో పోటీ  
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌తో పాటు పార్టీల బ‌లాన్ని మ‌రింత పెంచుకోవ‌డానికి కీల‌క నేత‌లంతా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌లహాస‌న్ కూడా ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ష‌ర‌తు పెట్టారు. త‌మ‌ పార్టీ నుంచి పోటీ చేయాల‌నుకుంటోన్న‌ అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని, వారు దరఖాస్తు రుసుముగా రూ.25 వేలు చెల్లించాల‌ని పేర్కొన్నారు. పార్టీయేతర నేత‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. త‌మిళ‌నాడు పుదుచ్చేరిలో మేలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 'మ‌క్క‌ల్ నీది మ‌య్యం' బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌తో పోటీ చేయ‌నుంది.

త‌మిళ‌నాడులోని 234 నియోజ‌క వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, క‌మ‌లహాస‌న్ త‌న కాలుకు ఆప‌రేష‌న్ చేయించున్న విష‌యం తెలిసిందే.  వ‌చ్చే నెల నుంచి పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాలలో ఆయ‌న  పాల్గొన‌నున్న‌ట్టు స‌మాచారం. ఆప‌రేష‌న్‌కు ముందు కూడా ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేశారు.


More Telugu News