స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలను బయటపెట్టాలి: సబ్బం హరి డిమాండ్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ మాట్లాడాలి 
  • స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా దీక్షలో కూర్చుంటా
  • ఉద్యమం తీవ్ర రూపు దాలుస్తుందని హెచ్చరిక 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి బయటకు రావాలని... ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. వైజాగ్ స్టీల్ విషయంలో రాష్ట్ర పెద్దలకు స్వలాభం ఉందని తనతో పాటు మరెందరో అనుమానిస్తున్నారని చెప్పారు.

అసలు విషయాన్ని వెల్లడించకపోతే జగన్ అంత రాక్షసుడు ప్రపంచంలో మరెవరూ ఉండరని సబ్బం హరి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈరోజు దీక్షాస్థలికి వెళ్లిన సబ్బం హరి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంపై విమర్శలు గుప్పించారు.

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం దీక్ష చేస్తున్న పల్లాతో కలిసి తాను కూడా పని చేస్తానని సబ్బం హరి చెప్పారు. ఆయన తర్వాత తాను దీక్షలో కూర్చుంటానని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్ర రూపు దాలుస్తుందని హెచ్చరించారు. పల్లా ఆరోగ్యం బాగోలేదని... ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ తో పాటు, ఆయనను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు.


More Telugu News