విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. నేడు కేంద్ర ముఖ్యులతో మాట్లాడతా: సోము వీర్రాజు

  • వైజాగ్ స్టీల్ భూములను కారు చవకగా అమ్మడాన్ని అడ్డుకుంటాం
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు
  • మాచర్ల నియోజకవర్గంలోని 74 ఏకగ్రీవాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం
  • వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి, అధికారాన్ని కైవసం చేసుకుంటాం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ రోజురోజుకు ఉద్యమం తీవ్రతరమవుతున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ భూములను కారుచవకగా ప్రైవేటు సంస్థలకు విక్రయించడాన్ని అడ్డుకుంటామని పేర్కొన్నారు. నిన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి, రెంటచింతలలో విలేకరులతో మాట్లాడిన ఆయన నేడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన 74 ఏకగ్రీవాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి, అధికారాన్ని చేజిక్కించుకుంటామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News