కరీంనగర్‌లో ఇసుక మాఫియా ఆగడాలు.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల బైక్‌పైకి ట్రాక్టర్!

  • వెంకటాయపల్లి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా
  • అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్యాయత్నం
  • ట్రాక్టర్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు
తెలంగాణలోని కరీనంగర్ జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్యాయత్నానికి ప్రయత్నించింది. వారి వాహనంపైకి ట్రాక్టర్ ఎక్కించి భయభ్రాంతులకు గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం..  జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లి శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నిన్న ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

‘బ్లూకోల్ట్’ సిబ్బంది వెంటనే బైక్‌పై వాగువద్దకు వచ్చారు. వీరిని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ పల్లపు నర్సయ్య వాహనాన్ని వేగంగా నడిపి పోలీసులపైకి దూసుకొచ్చాడు. వారి బైక్‌ను ఢీకొట్టి దానిపైకి ట్రాక్టర్‌ను ఎక్కించాడు. పోలీసులు స్వల్ప గాయాలతో దీని నుంచి బయటపడగా బైక్ నుజ్జు అయింది.

సమాచారం అందుకున్న ఎస్సై నరేష్‌రెడ్డి సిబ్బందితో కలిసి వచ్చి ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యజమాని ఒర్సు మల్లేశం, డ్రైవర్ నర్సయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News