ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ వీరబాదుడు.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు!

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిరాశ పరిచిన అర్జున్
  • విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో దక్కని చోటు
  • 31 బంతుల్లో 5 ఫోర్లతో 77 పరుగులు
ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిరాశపరిచి, విజయ్ హజారే ట్రోఫీలో తలపడే ముంబై సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మొత్తానికి లైన్‌లోకి వచ్చాడు. 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో ఎంఐజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.

ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అలాగే, బౌలింగులో మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్‌ ఇలా చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

అర్జున్‌కు తోడు కెవిన్ (96), ప్రగ్నేష్ (112) చెలరేగడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇస్లాం జింఖానా జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీ.. కరోనా తర్వాత ముంబైలో జరిగిన తొలి పోటీ కావడం గమనార్హం.


More Telugu News