ఐరాసలో ఉద్యోగి.. సంస్థ చీఫ్​ పదవికి పోటీ: సెక్రటరీ జనరల్​ బరిలో నిలిచిన భారత సంతతి మహిళ

  • అత్యున్నత పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన 34 ఏళ్ల అరోరా ఆకాంక్ష
  • ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న గుటెరస్ పదవీ కాలం
  • మళ్లీ పదవి కోసం ప్రయత్నిస్తాననడంతో.. పోటీలో ఆకాంక్ష
  • ఇప్పటిదాకా ఉన్నవారు ఐరాసకు చేసిందేమీ లేదని అసహనం
  • ప్రపంచానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కామెంట్
  • 75 ఏళ్లలో  చాలా వెనకబడిపోయామని ఆవేదన
ఐక్యరాజ్యసమితికి తదుపరి సెక్రటరీ జనరల్ పదవి బరిలో భారతీయురాలు నిలిచారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో సారి ఆ పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాను చూస్తూ ఉండలేనని, కొత్త ఐరాస కోసం మార్పు కావాల్సిందేనని పేర్కొన్న భారత సంతతికి చెందిన అరోరా ఆకాంక్ష.. పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ఈ నెల 9న ప్రకటించారు. తద్వారా బరిలో నిలిచిన తొలి వ్యక్తి అయ్యారు. అంతేకాదు, తన ప్రచారాన్నీ ప్రారంభించారు. అరోరాఫర్ఎస్జీ (#AroraForSG) పేరిట ఈ నెలలోనే ప్రచారం మొదలుపెట్టారు. రెండున్నర నిమిషాల వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

34 ఏళ్ల అరోరా ఆకాంక్ష ఐరాస అభివృద్ధి విభాగంలో ఆడిట్ కోఆర్డినేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వాస్తవానికి తన లాంటి స్థానంలో ఉన్న వారు ఇలాంటి పదవి కోసం పోటీలో నిలవడానికి ఆసక్తి చూపించడం లేదని ఆకాంక్ష ఆవేదన వ్యక్తం చేశారు. కారణం, వంతు వచ్చే వరకు వేచి చూడడమేనన్నారు. ఇప్పటిదాకా ఐరాస అధిపతులుగా ఉన్నవారు.. సంస్థను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దలేదన్నారు. సంస్థలో జవాబుదారీ తనాన్ని నింపలేదని చెప్పారు.

75 ఏళ్లుగా ప్రపంచానికి చేస్తున్న హామీలను ఐరాస నెరవేర్చలేదని ఆకాంక్ష చెప్పుకొచ్చారు. శరణార్థులకు రక్షణ లేదని, మానవతా సాయం అందుతున్నది కొంత మొత్తమేనని, సాంకేతికత, ఆవిష్కరణల్లో వెనకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని కాంక్షించే ఐక్యరాజ్యసమితే అందరికీ కావాలని ఆమె అన్నారు.

గుటెరస్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో పూర్తి కానుంది. దీంతో రెండోసారీ పదవిలో కొనసాగేందుకు విజ్ఞప్తి చేస్తానని 71 ఏళ్ల ఆయన ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోటీ చేస్తాననడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News